తెలంగాణ
12 articles published

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. కేటీఆర్ కీలక అడుగు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏసీబీ ఆయనను A1 నిందితుడిగా పేర్కొంది. పిటిషన్‌పై నవంబర్‌లో విచారణ జరిగే అవకాశం ఉంది.

బంగారం వ్యాపారి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.1.5 కోట్లు ఇచ్చి విడిపించారా?
హైదరాబాద్‌లో బంగారం వ్యాపారి శ్రీనివాసరావు కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు మొత్తం రూ.1.5 కోట్లు చెల్లించి ఆయనను విడిపించుకున్నట్లు సమాచారం. మొదట రూ.కోటి డిమాండ్ చేసిన ముఠా, డబ్బులు తీసుకురావాలని సూచించగా.. వ్యాపారి భార్య రూ.70 లక్షలతో కాళీమాత ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ పోలీసుల ఉనికిని గుర్తించిన కిడ్నాపర్లు వ్యాపారిని తీసుకుని పరారైనట్లు తెలుస్తోంది. ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష
తెలంగాణలో ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఛార్జీలను పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500గా ఉంది. ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ప్రయాణికుల అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

కాజీపేట మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు రైల్వే చర్యలు
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 9 నుంచి 25 వరకు సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మార్గంలో 34 ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. అదనంగా హైదరాబాద్, చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు రెండు వన్‌వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ సర్వీసులతో తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రయాణికులకు అదనపు ప్రయాణ సౌకర్యం లభించనుంది.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి చోరీ.. నిర్మాణంలో ఉన్న ఇంట్లో విద్యుత్ సామగ్రి అపహరణ
హైదరాబాద్ ఉప్పల్ శ్రీరాఘవేంద్ర నగర్ కళ్యాణపురిలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో విద్యుత్ తీగలు, ఇతర సామగ్రి చోరీకి గురయ్యాయి. అర్ధరాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు అనుమానితుల కదలికలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో రాత్రి గస్తీ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జూరాల నీటి కోసం రైతుల ఆందోళన.. కేసులపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. పంటలు నీరు లేక ఎండిపోతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనకు దిగారని, వారికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదని ఆయన విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మూసీ రివర్‌ఫ్రంట్‌కు భారీ నిధులు.. రూ.1,108 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్
మూసీ రివర్‌ఫ్రంట్ పరిధిలో మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధి, ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1,108.27 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఆలయ సముదాయానికి రూ.948.65 కోట్లు, 2.50 కిలోమీటర్ల ఆరు లేన్ల రహదారికి రూ.159.62 కోట్లు కేటాయించారు. ఈ రహదారి గ్రేహౌండ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు అనుసంధానం కానుంది.

కేయూలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు షోకాజ్.. యూజీసీకి లేఖలపై అభ్యంతరం
కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. ప్రమోషన్లకు సంబంధించిన నిబంధనలపై వారు నేరుగా యూజీసీకి లేఖ రాయడంపై యూనివర్సిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త యూజీసీ నిబంధనల వల్ల పీహెచ్డీ ప్రక్రియతో ముడిపడిన ప్రమోషన్లు ఆలస్యం అవుతున్నాయని అధ్యాపకులు పేర్కొన్నట్లు తెలిసింది.

హస్తినాపురంలో నిలిపి ఉన్న కారు దగ్ధం.. కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉన్న షిఫ్ట్ కారులో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఎవరైనా కావాలనే నిప్పంటించారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తూ, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. కిలో రూ.80కు చేరిన ధర
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉల్లి ధర కిలో రూ.80కు చేరడంతో సామాన్యులపై భారం పెరిగింది. గతంలో రూ.20–25గా ఉన్న ధర ప్రస్తుతం రూ.75–80కి చేరింది. పంట నష్టం, దిగుబడి తగ్గడం, సరఫరాపై ప్రభావం వంటి కారణాలతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా ఉల్లి వినియోగాన్ని తగ్గిస్తున్నాయి.

భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ టీ స్టాల్ యజమాని మృతి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీ స్టాల్ యజమాని సుధాకర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించగా.. పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. సుధాకర్‌కు స్థానిక కిరాణా షాప్ యజమానితో వివాదం ఉన్నట్లు సీపీ వెల్లడించారు.

బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ
బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నాగేశ్వరరావు నియమితులైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, రైతులు–ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించాలని నాయకులు ఆకాంక్షించారు.

